మానసిక ఆరోగ్యంపై తొలిసారిగా మాట్లాడిన శ్రీజ కొణిదెల

  • గతంలోని బాధల వల్లే తన గుర్తింపు అని భావించానని వెల్లడి
  • సెల్ఫ్ మాస్టరీ ప్రాజెక్టు తనలో మార్పు తెచ్చిందని వ్యాఖ్య
  • బాధితురాలిగా కాకుండా జీవితాన్ని సృష్టించుకోగలనని గ్రహించా
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శ్రీజ వీడియో
మెగాస్టార్ చిరంజీవి తనయ, నటుడు రామ్ చరణ్ సోదరి శ్రీజ కొణిదెల తన మానసిక ఆరోగ్య పరిస్థితిపై తొలిసారిగా బహిరంగంగా స్పందించారు. తాను ఎదుర్కొన్న ఆవేదన, గతంలోని చేదు జ్ఞాపకాల నుంచి ఎలా బయటపడిందో వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

సుదీర్ఘ కాలం పాటు గతంలోని గాయాలు, సవాళ్లతోనే తన జీవితాన్ని బేరీజు వేసుకున్నట్లు శ్రీజ తెలిపారు. "ఇదంతా నాకే ఎందుకు జరుగుతోంది? నేనెందుకు ఇంత వేదన అనుభవించాలి? ఒకదాని తర్వాత ఒకటి కష్టాలు ఎందుకు వస్తున్నాయి?" వంటి ప్రశ్నలు తనను వేధించాయని ఆమె గుర్తుచేసుకున్నారు. ఒకానొక దశలో తనను తాను బాధితురాలిగా భావించేదాన్నని ఆమె వెల్లడించారు.

అయితే, 15 నెలల పాటు సాగిన 'సెల్ఫ్ మాస్టరీ ప్రాజెక్ట్' తన ఆలోచనా దృక్పథాన్ని పూర్తిగా మార్చివేసిందని శ్రీజ వివరించారు. "ఈ క్రమంలో నేను బాధితురాలిని అనే భావన నుంచి బయటపడ్డాను. నా జీవితాన్ని నేనే మలుచుకోగలననే శక్తి నాకుందని గ్రహించాను" అని ఆమె పేర్కొన్నారు. గతంలోని బాధ తన జీవితంలో ఒక భాగమే తప్ప, అదే తన పూర్తి గుర్తింపు కాదనే సత్యాన్ని తెలుసుకున్నట్లు శ్రీజ ఆ వీడియోలో స్పష్టం చేశారు.

శ్రీజ వ్యక్తిగత జీవితం గతంలో పలుమార్లు వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. 2007లో శిరీష్ భరద్వాజ్‌తో, 2016లో కల్యాణ్ దేవ్‌తో ఆమెకు వివాహాలు జరగ్గా, అనివార్య కారణాలతో ఆ బంధాలు విచ్ఛిన్నం అయ్యాయి. ఆమెకు నివృత్తి, నవిష్క అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా, శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ 2024లో అనారోగ్యంతో కన్నుమూశారు. కాగా, మానసిక ఆరోగ్యంపై శ్రీజ ధైర్యంగా స్పందించిన తీరును నెటిజన్లు అభినందిస్తున్నారు.

Sreeja Konidela
Mental Health Journey
Self Mastery Project
Megastar Chiranjeevi Daughter
Instagram Video

More Telugu News